CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు
I have never done politics with political factions.. and I will never do it again - Chandrababu

ఆంధ్రప్రదేశ్:ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన లా అండ్ ఆర్డర్ కీలకమని చెబుతూ ఈ సందర్భంగా అసాంఘిక శక్తులకు వార్నింగ్ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కక్షలతో తానెప్పుడూ రాజకీయం చేయలేదని.. ఇక ముందు కూడా చేయనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిపై ప్రశ్నిస్తే టీడీపీ పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ప్రభుత్వం సింహస్వప్నంలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ పైనా ఉక్కుపాదం మోపామని సభలో చంద్రబాబు తెలిపారు. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పారాయన. స్వార్థం కోసం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క ఎకరాల్లో కూడా గంజాయి పండించడానికి వీల్లేదన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామని.. ఆపేదే లేదన్నారు చంద్రబాబు. పిల్లలను, కుటుంబ సభ్యులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్జప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి ఉండేదని చంద్రబాబు అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీలు, ఆకతాయిలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ముఠాలు, కుమ్ములాటలు ఇక చెల్లవని చెప్పారు. నేరస్తులు ఎలా ట్రాప్‌లో పెడతారనేందుకు వివేకా నంద రెడ్డి హత్యే ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారని.. పోస్టుమార్టం తర్వాత వివేకాది హత్య అని తేలిందని చంద్రబాబు చెప్పారు. హత్యా రాజకీయాల మరక అంటకుండా తాము పాలించామని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినిల రక్షణ కోసం శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు చంద్రబాబు సభలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశ అనే దిక్కుమాలిన యాప్ తీసుకొచ్చారని చెప్పారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని అన్నారు.భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా పకడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించగలిగినా.. వైసీపీ హయాంలో చేసిన భూవివాద సమస్యలు మాత్రం కొలిక్కి తేలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. రికార్డులు తారుమారు చేశారని, ప్రభుత్వ, ఫారెస్ట్ భూములు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు.