ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్ దిశానిర్దేశం
The government should be held accountable for its debts.. KCR's direction

హైదరాబాద్-సూర్య టుడే:రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సూచనలు చేశారు. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నానని కేసీఆర్ పార్టీ నేతలకు తెలిపారు. హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రతినిధులకు గులాబీ బాస్ సూచించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి సుదీర్ఘంగా వివరించారాయన. పదేళ్లలో బీఆర్ఎస్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే... కాంగ్రెస్ 14 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిందని అన్నారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోపణలు చేశారు.రేపు తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతానని చెప్పిన కేసీఆర్.. 9.30కి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని చెప్పారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని చెప్పారు. ఎల్పీలో సమావేశం నిర్వహించుకుని తర్వాత సభలోకి వెళ్లాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.