TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
The TUWJ (IJU) committee should be abolished.

ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం
రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి.
*మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు.
*పదవి, మార్పు ఎజెండాగా టీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా మహాసభ.
*కమిటీ రద్దు చేయకపోతే ప్రత్యామ్నయం చూసుకుంటాం.
*రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్.
రంగారెడ్డి -సూర్య టుడే: ఓ మాజీ మంత్రి పీఆర్వోను టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సిగ్గుచేటని, జిల్లా టీయూడబ్ల్యుజే నూతన కమిటీని పునః పరిశీలించి వెంటనే రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్ లు రాష్ట్ర కమిటీకి సూచించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సంఘానికి చెందిన జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు రఘుపతి మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లిలో జరిగిన టీయూడబ్యుజే రంగారెడ్డి జిల్లా మహాసభ ఏకపక్షంగా, నియంతృత్వ పోకడలతో జరిగిందని విమర్శించారు. ఒకే వర్గానికి పెద్దపేట వేస్తూ ఒక ప్రాంతానికి, మరికొంత మంది జర్నలిస్టు నాయకుల అనుచరులకు పదవులు కట్టబెడుతూ అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి పీఆర్వో సలీంను నూతన కమిటి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సిగ్గుచేటన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు దీనిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం జర్నలిస్టు వ్యతిరేఖ కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా తాము స్పందించామని, రాష్ట్ర స్థాయి నాయకులు దేవులపల్లి అమర్, విరాహత్ అలీ, సత్యనారాయణ, నరేందర్ రెడ్డి లాంటి నాయకుల పిలుపుకు శిరసావహించి ఎన్నో కార్యక్రమాలలో పాలు పంచుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నో కష్ట నష్టాలను జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఖుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, తాండూరు, రాజేంద్రనగర్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, ఎల్బీనగర్ తదితర నియోజకవర్గాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డిని సుదీర్ఘంగా పదేళ్లపాటు జిల్లా అధ్యక్షునిగా నియమించినప్పటికీ తాము సహకరించామని అంతకుముందు వెంకట్ రెడ్డికి కూడా సహకరించామని ఇప్పుడు మరోసారి ఓసి వర్గానికి చెందిన సలీం ఏకపక్షంగా రాత్రిపూట ఎన్నుకున్నారని, సీనియర్ జర్నలిస్టుల సూచనలు సలహాలు తీసుకోకుండా నియమించడం సబబు కాదన్నారు. శ్రీకాంత్ రెడ్డి నియంతృత్వ పోకడలతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులను గ్రూపులుగా విభజించి పాలించారని, వాస్తవాలు తెలియకుండా రాష్ట్రస్థాయి నాయకులను పక్కదారి కూడా పట్టించారని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డి తన అనుచరులకు, తనకు తాబేదార్లుగా ఉన్న వారిని సంఘంలో నియమించుకొని తన వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉన్న వారిని కమిటీ పదవుల్లో నియమించారని తీవ్రంగా ఆరోపించారు. యూనియన్ లో ఏళ్ల తరబడి పనిచేసిన సీనియర్ జర్నలిస్టులకు సన్మాన సత్కారాలు లేకుండా నిన్న మొన్న ఈ రంగంలో అడుగుపెట్టిన వారిని కూడా అందలమెక్కించి సన్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని, ఎంతో మంది జర్నలిస్టులు దీనికి బాధపడ్డారన్నారు. శ్రీకాంత్ రెడ్డి స్వార్థ బుద్ధితో ఆయనకు అనుకూలంగా ఉన్న ఓ మాజీ మంత్రి పీఆర్వోగా పనిచేసిన సలీం అనే వ్యక్తిని నేడు అధ్యక్షుడిగా నియమించడం తగదన్నారు. నిన్న జరిగిన మహాసభలో నూతన కమిటీ విషయంలో వాయిదా వేస్తున్నట్లు చెప్పిన రాష్ట్ర నాయకులు రాత్రికి రాత్రే తమకు అనుకూలంగా ఉన్నవారిని కమిటీలో వేయడం సిగ్గుచేటన్నారు. దీనివల్ల యూనియన్ కు చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. దేవులపల్లి అమర్, విరాహత్ అలీలు ఈ కమిటీ ఎర్పాటు పట్ల పునఃపరిశీలన చేసుకోవాలని, ఈ కమిటీని రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే మెజార్టీ జర్నలిస్టులు ప్రత్యామ్నాయ పరిస్థితులు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇది మహాసభగా భావించడం లేదు - సీనియర్ జర్నలిస్టు గణేష్
శంకర్ పల్లిలో జరిగిన టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రంగారెడ్డి జిల్లా మహాసభను తాము ఓ జర్నలిస్టు మహాసభగా గుర్తించడం లేదని సీనియర్ జర్నలిస్టు గణేష్ వ్యాఖ్యానించారు. కేవలం పదవి, మార్పు ఎజెండాతో సభను నిర్వహించారని విమర్శలు గుప్పించారు. జిల్లా మహాసభల సందర్భంగా కార్యవర్గంలోని సభ్యులకు సరిగ్గా ఆహ్వానాలు కుడా లేవని ఆరోపించారు. పగలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, రాత్రి కమిటీలను వేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. టీయూడబ్యుజేలో ఏనాడు చర్చలు ఉండవని, సమన్యాయం అందరి పట్ల ఉండదని అంతా ఏకపక్షంగానే జరుపుకుంటారని ఆరోపించారు. అనైతికంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా కొందరు ప్రవర్తిస్తున్నారని అన్నారు. సీనియర్లను పట్టించుకోరని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మంది నాయకులకు తమ సమస్యలు విన్నవించామని, వారికి మీడియా పరంగా సహకరించామని, సీఎం నుండి ఎమ్మెల్యేల దాకా తాము సహకరించినందుకు ప్రభుత్వం ఏర్పాటయ్యిందని, కనీసం జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం మంత్రులను, ఎమ్మెల్యేలను ఎవరినీ కూడా మహాసభకు ఆహ్వానించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలకు మహాసభ ద్వారా ప్రజా ప్రతినిధులు వచ్చి ఉంటే పరిష్కారం దొరికేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దిశ సురేష్, చంద్రశేఖర్, రాచళ్లపల్లి నర్సింహ్మ, దరువుల శంకర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.