SLCB Tunnel :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్:Relief efforts ongoing at SLBC Tunnel.. District Collector supervises work

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక బృందాలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాలకు అందిస్తున్న వసతి సదుపాయాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. దోమల పెంటలోని జడ్పిహెచ్ఎస్, యుపిఎస్ స్కూల్, స్పోర్ట్స్ క్లబ్, ఈగలపెంటలోని జిమ్ సెంటర్, కళాభారతి, పటేల్ హాల్, ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మార్పులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. సహాయక సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఆహార, తాగునీరు, మెడికల్ సదుపాయాలు, రక్షణ సామాగ్రి వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగేలా సిబ్బందికి అవసరమైన ప్రత్యేక పౌష్టికాహారం, వైద్య సేవలు, అవసరమైన సాధనాలు, ప్రత్యేక రక్షణ పరికరాలు, విశ్రాంతి ప్రాంతాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
సహాయక బృందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత 22 రోజులుగా నిరంతరాయంగా టన్నెల్ ప్రమాద స్థలంలో అహర్నిశలు శ్రమిస్తూ, సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. సహాయక కార్యకలాపాల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, రైల్వే బృందం, హైడ్రా, ర్యాట్ మైనర్స్ సహా ఇతర బృందాల సభ్యులు అత్యున్నత నిబద్ధతతో పనిచేస్తున్నారని, వారి సేవలు అమోఘమని ప్రశంసించారు. సహాయక చర్యలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు