తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు వెళ్లి ఉద్యమించిన నేత పేరును తొలగించి అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరు తొలగించారని... మరి ఆ మూలాలున్న ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డిపేర్లను కూడా తొలగిస్తారా? అని అన్నారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డబోయిన గోపీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య, SC వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. పొట్టిశ్రీరాములు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రను వేరు చేయాలని ఉద్యమించారే తప్ప.. ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని .. అలాంటి నాయకుడి పేరు తీసేసి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనుకోవడం దుర్మార్గమని బండి సంజయ్ విమర్శించారు.