సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested

సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ సోముల లోకేష్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు.పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ కే. ప్రమోద్ మీడియా కు తెలిపారు. కోవెలకుంట్ల మండలం కంపమల్లలో ఈనెల 12వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో వైసీపీ నాయకుడు సోముల లోకేష్ రెడ్డి ఇంటిపై అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు కర్రలు, ఇనుపరాడ్లుతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన లోకేష్ తండ్రి వెంకటరామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డిలపై దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. తన ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న సోముల లోకేష్ రెడ్డి ఇంటి వద్దకు రాగా ప్రత్యర్థులు లోకేష్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రాణ భయంతో పొలాల్లోకి పరిగెత్తిన లోకేష్ రెడ్డిని వెంబడించి ఇనుప రాడ్లు , వేట కొడవళ్ళు తో దాడికి పాల్పడ్డారు. అప్పటికే గ్రామస్తులు డయల్ 112 కు కాల్ చేయగా సమాచారం అందుకున్న కోవెలకుంట్ల ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. పోలీస్ వాహనం సైరన్ విన్న నిందితులు సంఘటనా స్థలం నుండి పరారయ్యారు.తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న లోకేష్ రెడ్డిని పోలీసులు వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం లోకేష్ రెడ్డిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లోకేష్ రెడ్డికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనలో లోకేష్ రెడ్డి తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంపమల్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు సూర చిన్న సుబ్బారెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారిలో ఉన్న మరో ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలిపారు..