రాజకీయ సంస్కరణలు రావాలి !
ప్రజల ఎజెండా ముందుకు రావడం లేదు.

రాజకీయ సంస్కరణలు లేకుండా భారత్ మనుగడ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎంతసేపు సీట్లు, ఓట్లు,నాయకుల జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఉచిత పథకాలు వంటివాటి చుట్టే రాజకీయం సాగుతోంది. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు రావాల్సి ఉంది. చైనా లాంటి దేశాలు ఆర్థికంగా పురోగమిస్తుంటే భారత్ మాత్రం కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా కుంటుతోంది. ఇంకా సీట్లు పెంచుకోవాలి...తమకు అవకాశాలు పెంచుకోవాలన్న దురాలోచన తప్ప ప్రజల సమస్యలు తీర్చడం, ఆకలి బాధలు తీర్చడం, సౌకర్యాలు పెంచడంవంటివన్నీ పక్కకు పోతున్నాయి.
ప్రజల ఎజెండా ముందుకు రావడం లేదు.
డీలిమిటేషన్‌తో తమ సీట్లు తగ్గుతాయని గొడవ చేస్తున్న స్టాలిన్ లాంటి వారు దీనికి సమాధానం చెప్పాలి. ఆయనకు వ్తాసు పలుకుతున్న వారు కూడా సమాధానం చెప్పాలి. అలాగే పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ముందుగా సమాధానం చెప్పాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా లేదా..ధరలు అదుపులోకి వచ్చాయా లేదా..నిరుద్యోగం తగ్గిందా లేదా అన్నది చట్టసభల్లో చర్చించడం లేదు. ప్రజలకు అవసరం లేని ఎజెండాలు తెరపైకి తెచ్చి, తమ పబ్బం గడుపుకునే రాజకీయాలు సాగుతున్నాయి. భారత జనాభా 140 కోట్లకు చేరిన క్రమంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం లేదు. ఇంకా జనాభా పెరగాలని కొందరు ప్రాంతీయ పార్టీల నేతలు ముఖ్యంగా స్టాలిన్, చంద్రబాబు లాంటి వారు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఉన్న ప్రజలకు సరైన ప్రాథమిక సౌకర్యాలు కలిగించకుండా తమ రక్షణ కోసం వందలకోట్లు వెచ్చిస్తున్న వీరు ప్రజలను రక్షిస్తారనుకోవడం అత్యాశే కాగలదు. మారుతున్న కాలానుగుణంగా పాలకులలో మార్పులు రావడం లేదు. ఇకపోతే ఒకే పార్టీలో ఉంటున్న కొందరు రాజకీయ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. పాలనలో వారు, వారి కుటుంబ సభ్యులు నిరంతరంగా ఉండే విధంగా రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒక్కరినే నిరంతరంగా ఎన్నుకునే విధానం కూడా మంచిది కాదు. ఈ క్రమంలో రాజకీయాల్లో మార్పులు రావాలి. అమెరికా తరహాలో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికల్లో పోటీచేసే విధానం రావాలి. ఒక్కరే ఏళ్లతరబడి ఎంపిలుగా, ఎమ్మెల్యేలుగా ఉండకుండా కేవలం రెండు టర్ముల కాలాన్ని మాత్రమే నియంత్రించాలి. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణలు తీసుకుని రావాల్సి ఉంది. ప్రజలు ఈ ఎజెండాతో ముందుకు రావాలి. అప్పుడే యువతకు అవకాశం వస్తుంది. మువత రాజీకాయల్లోకి వస్తే మార్పులు కూడా వస్తాయి. ఎన్నికల్లో పోటీ చేసేవారికి అర్హతలను కూడా నిర్ణయించాలి. ఇలా అర్హతలు లేకపోవడం వల్లనే స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందడం లేదు. కొందరే పాలకులుగా ఉంటూ..ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారు. అందుకే పేదలు పేదలుగానే ఉన్నారు. ఆకలి కోసం అలమటిస్తున్న వారు అలాగే ఉన్నారు. రాజకీయ నేతలు పేదల పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యం,విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం,ఉచిత పథకాలను ప్రవేశ పెట్టడం వంటివన్నీ తగ్గాలి. మనం వేసే ఓటు సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. మన ఓటుతో గెలిచిన నేతలు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అన్నది కూడా ప్రజలే ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. మన ఓటును ఆయుధంగా చేసుకుని దేశాన్ని సక్రంగా ముందుకు తీసుకుని వెళుతున్నారా లేదా అన్న ఆలోచన చేయాలి. ఏదో ఓటేశామన్న నిర్లిప్త ధోరణి కారణంగా పాలకులు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని, అధికారం చేతబట్టి శాసిస్తున్నారు. ప్రజలను ఓటుబ్యాంకుగా తయారుచేసుకుని వారిని మభ్యపెట్టడం అలవర్చుకున్నారు. ఎన్నికల అక్రమాల్లో ఆరితేరిన నేతలంతా పాలకులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. ఓట్లను కొనుగోలు చేయడం ఎలాగో నేర్చుకున్నారు.
మనం ఓటుకు అమ్ముడు పోవడం వల్లనే ఇలా జరుగుతోందని గుర్తించాలి. తమకు అనుకూలమైన ఎన్నికల అధికారులను, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని ఓట్లను వేయించుకుని ఎన్నికవుతున్నారు. ఈ విధానం పోవాలంటే ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాలి. ఒక్కరే నిరంతరంగా సర్పంచ్ నుంచి ఎంపి వరకు ఎల్లవేళలా ఎన్నికయ్యే పద్దతికి స్వస్తి పలకాలి. చట్టసభల్లో అమెరికా లాగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే పోటీచేసే అవకాశం మాత్రమే ఉండాలి. ఎంపి, లేదా ఎమ్మెల్యేగా గెలిచిన వారు రెండు టర్మ్‌లకు మించి పనిచేయకుండా చట్టబద్ద విధానం అమల్లోకి తీసుకుని రావాలి. జీవితాంతం ఒక్కరే ఎంపిగా లేదా ఎమ్మెల్యేగా ఉండే విధానం పోవాలి. దీనికి తక్షణ రాజ్యాంగ సంస్కరణ అవసరం. అప్పుడు ప్రజల్లో ఎక్కువ మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుంది. కొందరు నాయకులు మాత్రమే నిరంతరంగా అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆగత్యం ఉండదు. అలాగే కుటుంబంలో ఒక్కరికి ఒకే పదవి అన్న విధానం కూడా రావాలి. వారసత్వ రాజకీయాలను అడ్డుకోవడానికి ఇది దోహద పడగలదు. దేశంలోని యువత, మేధావులు దీనిపై చర్చచేయాలి. అలాగే రాజకీయ నాయకుల అవినీతిపై తక్షణం విచారణ జరిగేలా చట్టాలు రావాలి. సామాన్యులకు ఎలా అయితే చట్టబద్ద విచారణ సాగి, శిక్షలు పడుతున్నాయో రాజకీయాల ను, పాలనను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కోట్లు గడిస్తున్న నాయకులకు కూడా అలాగే విచారణ జరగాలి. శిక్షలు పడాలి. ఇలాంటి సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అక్రమంగా వేలకోట్లు సంపాదిస్తున్న వారంతా మహా నేతాలుగా చలామణి అవుతున్నారు. ఇకపోతే రాష్టాల్ల్రో అధికారం లో ఉండగా అవినీతికి పాల్పడిన నేతలను విచారించి కఠినచర్యలు తీసుకునే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉండాలి. కేంద్రంలో అవినీతి జరిగితే కూడా నేతలను తక్షణం విచారించే రాజ్యాంగ వ్యవస్థ రావాలి. ఎప్పటికప్పుడు సంస్కరణలు చేసుకుంటూ.. రాజ్యాంగాన్ని సవరించుకుంటున్న మనం ఈ విషయంలో కూడా సవరణలకు పూనుకోవాలి. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం వల్ల ఆయా నేతల కారణంగా ఎక్కువ శాతం అవినీతికి ఆస్కారం ఏర్పడింది. అలాంటి వారి పనిపట్టే చట్టబద్ద వ్యవస్థ ఉండాలి. రాజకీయ పార్టీల నేతల అవినీతిపై సత్వర విచారణకు సుప్రీం సూచించినా అడుగు ముందుకు పడడం లేదు. అవినీతి కేసులు ఉన్నా ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా చలామణి అవుతున్నారు. రాజకీయ అవినీతిని నిరోధించేలా రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుడితేనే మన ప్రజాస్టామ్యానికి అర్థం ఉంటుంది.