Who will board the helicopter? Who will buy it?హెలికాప్టర్ ఎక్కేదెవరు? కొనేదెవరు?
తెలంగాణ కేబినెట్ చిన్నాభిన్నం

మంత్రుల మధ్య తీవ్ర విభేదాలు
ఖమ్మం, నల్గొండ నేతలపై రాజనర్సింహ ఫైర్
రాజనర్సింహ శాఖలో భట్టి, కోమటిరెడ్డి చొరబడుతున్నారా?
వారిద్దరికి రేవంత్ ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారు?
తెలంగాణ-సూర్య టుడే:తెలంగాణ కేబినెట్‌లో ఏం జరుగుతోంది? మంత్రుల మధ్య విభేదాలు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లా మంత్రులే ఎందుకంత ప్రాధాన్యమనే భావన అందరిలో మొదలైందా? సీనియర్ లీడర్, తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నల్గొండ జిల్లా మంత్రులపై ఎందుకు అసహనం వ్యక్తం చేశారు.తెలంగాణ మంత్రివర్గంలో రెండు జిల్లాలకే అత్యధిక ప్రాతినిధ్యం దక్కింది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి మంత్రులుగా ఉన్న నేతలే రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఆ జిల్లాల నేతలకే అధిక ప్రాధాన్యమున్నట్లు అందరికీ అర్థమవుతోంది. ఇదే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల్లో సాగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు, నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. వీరిలో అందరూ రాజకీయంగా సీనియర్ లీడర్లు. భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే మెదక్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న చెందిన దామోదర రాజనర్సింహ చాలా పరిణితి కలిగిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. వైఎస్ హయాంలో రాజనర్సింహ ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి మెదక్ జిల్లానే కాదు, రాష్ట్రంలో కొంతమేర ప్రభావితం చేయగల సమర్థత ఉన్న నాయకుడు రాజనర్సింహ. అయినా కూడా, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అతను పరిధిలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు.
అయితే ఈ మధ్య ఆయన ఈ ఖమ్మం, నల్గొండ జిల్లా మంత్రులపై రాజనర్సింహ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను ఒక్కసారి కూడా హెలికాప్టర్ ఎక్కలేదని అన్నారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా, వాటిని కొనాలన్న రెండు జిల్లాల మంత్రులకే సాధ్యమని బహిరంగ విమర్శలు చేశారు. కొందరు మంత్రులతే హెలికాప్టర్ లేకపోతే కాలు బయటపెట్టడంలేదని దామోదర ఎద్దేవా చేశారు. ఆ మంత్రుల కోసం వారు సెక్రటేరియట్‌పై హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజనర్సింహ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేబినెట్‌లో ముఖ్యుడిగా ఉన్న మంత్రి నుంచి తోటి మంత్రులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
మంత్రి రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు నిజమే కదా అనే భావన విమర్శకుల నుంచి ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. భట్టిని రాష్ట్రంలో నెంబర్ 2గా భావిస్తున్నారు. రేవంత్ తర్వాత కొన్ని కీలక శాఖల బాధ్యతలు కూడా భట్టి నిర్వర్తిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, రోడ్డు, భవనాల శాఖలు ఉన్నాయి. అయితే ముఖ్య శాఖలు చేతిలో ఉంచుకున్న భట్టి, కోమటిరెడ్డి తమతమ జిల్లాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మరి ఆయన అసహనం వ్యక్తం చేయాల్సినంత ఇబ్బందికర పరిస్థితులు పార్టీలో ఎదురవుతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజనర్సింహ నిర్వర్తిస్తున్న శాఖలోనూ భట్టి, కోమటిరెడ్డి వేలుపెడుతున్నారా? అనే ప్రశ్న సహజంగానే ఎదురవుతోంది. అందువల్లే దామోదర ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర కేబినెట్ మంత్రుల మధ్య పొసగడం లేదని చెప్పకనే చెప్పొచ్చు. కాగా మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నేతలకు ప్రజాస్వామ్యం ఎక్కువే. ఇది ప్రభుత్వంలో కూడా కొనసాగితే మనస్పర్థలతో కేబినెట్ చిన్నాభిన్నం కావొచ్చని విశ్లేషకుల అంచనా. దామోదర రాజనర్సింహ వ్యాఖ్యల దుమారం ఎంత దూరం వెళ్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.