సైలెంట్‌గా జిల్లాల పర్యటనల్లో ఎమ్మెల్సీ కవిత
జాగృతి కోసమా? బీఆర్ఎస్ పార్టీలో పట్టు కోసమా?

- సైలెంట్‌గా పర్యటనలు చేపట్టిన ఎమ్మెల్సీ
- ఏ హోదాలో సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ
- ఎమ్మెల్సీ కవిత నెక్ట్స్ టార్గెట్ ఏంటి?
సాయి సూర్య బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో జిల్లాలను చుట్టేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు, జాగృతి శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కవిత జిల్లాల పర్యటన వెనుకున్న ఆంతర్యం ఏమిటీ.
బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుకు వచ్చేది కేసీఆర్. రెండో స్థానంలో ఎవరనేది అతిపెద్ద ప్రశ్న. కేసీఆర్ ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు. బీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న కేసీఆర్...పార్టీ నేతలకు అప్పుడప్పుడు దిశానిర్దేశం చేయడం తప్ప..జనాల్లోకి వచ్చి సమస్యలపై పోరాడే పరిస్థితి లేదు. ఇక ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. ఐతే కేసీఆర్ తర్వాత పార్టీని కేటీఆర్ నడిపిస్తున్నప్పటికీ...హరీశ్ రావు కవిత కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నంతకాలం కేటీఆర్, హరీశ్ రావు పార్టీ కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొన్నారు. కవిత బయటికి వచ్చాక...కేటీఆర్, హరీశ్‌తో పాటు కవిత కష్టపడుతున్నారు. ఐతే కొన్ని రోజులుగా కవిత స్పీడ్ పెంచారు. అంతేకాదు.. తాజాగా చేపట్టిన జిల్లాల పర్యటన బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జిల్లాల పర్యటన కూడా సైలెంట్‌గా జరిగిపోతోంది. ఆమె జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ముందుగా బహిరంగంగా సమాచారం కూడా లేదు. ఆయా జిల్లాలకు వెళ్లే ఒకటి రెండ్రోజుల ముందు సమాచారం ఇస్తున్నారట. ఐతే కవిత పర్యటనలు సాఫీగా సాగుతున్నప్పటికీ..బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
కేటీఆర్ కార్యవర్గ అధ్యక్షుడిగా ఎటువంటి పర్యటనలు చేస్తే...వేరే చర్చ ఏదీ ఉండదు..కానీ కవిత ఆ పార్టీలో సభ్యురాలు, ఒక ఎమ్మెల్సీ అంతే తప్ప పార్టీ పదవుల్లో లేరు. కేసీఆర్ కుమార్తెగా ప్రత్యేక అభిమానం కార్యకర్తల్లో ఉంటుంది. ఐతే పార్టీ పదవుల్లో లేనప్పికటీ ఆమె జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశాల వెనుక కవిత పెద్ద ఆలోచన ఉండొచ్చని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.
ప్రస్తుతం బీఆర్ఎస్‌లో రెండో స్థానంలో కేటీఆర్ ఉన్నప్పటికీ...సీనియర్ గా ఉన్న హరీశ్ రావు అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికీ బదులు పార్టీలో తన స్థానం పటిష్టపరుచుకోవడం కోసం కవిత ఇలా జిల్లాల పర్యటనలు చేపట్టారా అని ఆలోచనలో పడ్డారట. మెల్లిమెల్లిగా బీఆర్ఎస్‌లో ప్రాభల్యం పెంచుకునే ప్రణాళికలో భాగమే ఇదంతా అంటున్నారు.
కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయితే...కవిత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసే అవకాశం ఉంటుంది. లేదంటే పార్టీ అధ్యక్ష పదవినే చేపడితే కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంచితే...జిల్లాల పర్యటనల్లో జాగృతి శ్రేణులతో కూడా సమావేశం అవుతున్నారని...జాగృతిని మరోసారి బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్, జాగృతి శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. ఏది ఏమైనా కవిత జిల్లాల పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.