నాడు ఇజ్రాయెల్‌లో నేడు భారత్‌లో ఒకే తరహా దాడి

పహల్గామ్‌లో  హమాస్ తరహా దాడి..!

On
నాడు ఇజ్రాయెల్‌లో నేడు భారత్‌లో ఒకే తరహా దాడి

2023 అక్టోబర్ 7..మతం మాటున ముష్కరుల మారణహోమం
ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రదాడి..1200 మంది మృత్యువాత..
2025, ఏప్రిల్ 22 మంచుకొండల్లో అదే ముష్కరుల మారణ హోమం
26 మంది పర్యాటకుల మృత్యువాత

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హమాస్ తరహా దాడులను అనుసరిస్తున్నారా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి.. పహల్గామ్ దాడికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెబుతున్నారు. 

కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిని పరిశీలిస్తే.. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన ఉగ్రదాడి గుర్తుకురాక మానదు. ఈ రెండు ఘటనలకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి. యూదులను లక్ష్యంగా చేసుకొని హమాస్ దాడి చేయగా... పహల్గామ్ ఉగ్రదాడి హిందువులే లక్ష్యంగా జరిగింది. ఈ రెండు ఘటనల్లో మతమే మారణ హోమానికి కారణమైంది.

ఇజ్రాయెల్‌పై దాడికి.. హమాస్ గాజా స్ట్రిప్ సమీపంలోని రిమ్ ప్రాంతంలో జరుగుతున్న నోవా ఫెస్టివల్ లక్ష్యంగా చేసుకొని దాని సమాచారాన్ని సేకరించింది.  పెద్దమొత్తంలో యూదులు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారని తెలుసుకొని కాల్పులకు తెగబడింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 1200 మందిలో 250 మంది నోవా ఫెస్టివల్ లో పాల్గొన్నవారే. యూదులెవరో అడిగి మరీ కాల్చి చంపారు. దాడి తర్వాత యూదులను చంపిన వీడియోలను హమాస్ విడుదల చేసింది. హమాస్ దాడికి ఏమాత్రం పొల్లుపోని రీతిలో.. పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. పహల్గామ్ దాడికి ముందు కూడా ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హిందూ పర్యాటకులు పెద్దమొత్తంలో వస్తున్నారని తెలుసుకొని మరీ దాడికి తెగబడ్డారు. చంపే ముందు హిందులెవరో? ముస్లింలెవరో? అడిగి, హిందువులని నిర్ధారించుకొని మరీ చంపారు. ఈ దారుణాన్ని కూడా ఉగ్రవాదులు బాడీ కెమెరాల ద్వారా రికార్డు చేశారు.

అటు హమాస్.. ఇటు పహల్గామ్ ఉగ్రదాడులు లక్ష్యం కేవలం ప్రాణాలు తీయడం మాత్రమే కాదు.. భయానక వాతావరణాన్ని సృష్టించడం. ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణను తీవ్రతరం చేయాలని భావించి, హమాస్ దాడికి తెగబడగా.. ప్రశాంత కశ్మీరంగా మారుతూ, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మంచుకొండల్లో కల్లోల వాతావరణాన్ని సృష్టించి, కశ్మీర్ లో మళ్లీ మునుపటి పరిస్థితులను సృష్టించడం పహల్గామ్ దాడి లక్ష్యం.  

ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన సమయంలో నోవా ఫెస్టివల్ లో యువత సంగీతం, నృత్యంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో టూరిస్టులు ఆటపాటల్లో మునిగిపోయారు. రెండు చోట్లా సంబరాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. తప్పించుకునే అవకాశం లేకుండా కాల్పులు జరిపారు. ఫెస్టివల్ నుంచి బయటకు వెళ్లే మార్గం లక్ష్యంగా హమాస్ దాడి జరపగా..  బైసరన్ వ్యాలీ నుంచి బయలకు వెళ్లే ఏకైక ఎస్కేప్ రూట్ లక్ష్యంగా ఉగ్రదాడులు కాల్పులు జరిపారు. రెండుచోట్లా బాధితులు దాదాపుగా ఒకేరకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

అటు హమాస్ చేతిలో మరణించినవారి గాథలెన్నో ప్రపంచ దేశాలను కదిలించాయి. హమాస్ ను అంతమొందించాలంటూ ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిమాండ్లు వచ్చాయి. అదే రీతిలో ఇటు.. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి గాథలూ కంటతడి పెట్టిస్తున్నాయి. దాడికి కారణమైన ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్నవారిని మట్టుపెట్టాలంటూ భారత్ తో సహా ప్రపంచ దేశాల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. మత చాందసవాదంతో.. భయాన్ని, అస్థిర, కల్లోల పరిస్థితులను సృష్టించడం ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం.

Views: 35
Tags:

Latest News