CS Shanti Kumari : ప్రస్తుత సీఎస్ శాంతి కుమారికి కొత్త బాధ్యత అప్పగిస్తారా?

సీఎస్, డీజీపీ పోస్టులకు రేసులో కీలక అధికారులు

On
CS Shanti Kumari : ప్రస్తుత సీఎస్ శాంతి కుమారికి కొత్త బాధ్యత అప్పగిస్తారా?
సీఎస్, డీజీపీగా ఎవరిని నియమిస్తుందో చూడాలి.

కొత్త వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
రామకృష్ణరావు, జయేశ్ రంజన్, వికాస్ రాజ్ ఎవరిని పదవి వరిస్తుంది?
రేసులో రవి గుప్తా, సీవి ఆనంద్, శివధర్ రెడ్డి సహా ఐదుగురు

 

సాయిసూర్య, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అత్యున్నత పదవులు ఖాళీ కానున్నాయి. రాష్ట్రానికి ఆయువుపట్టుగా, ప్రభుత్వాన్ని నడిపే ఉన్నతాధికారులుగా, సూపర్ బాస్ పోస్టులకు కొత్త వారిని నియమించే సమయం ఆస్నమైంది. ముఖ్యమంత్రి తర్వాత కార్యనిర్వాహక విధులు నిర్వహించే ఈ పోస్టుల్లో ప్రస్తుతం ఉన్న వారు రిటైర్మెంట్ కాబోతున్నారు. మరి వారి స్థానంలో ఎవరు రాబోతున్నారు. ఎవరిని పదవి వరించబోతోంది. ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులకు అనుమతి ఇస్తుందా? ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్న ఆ అధికారులు ఎవరు? ఆ పోస్టులకు తర్వాతి వరుసలో ఉన్నది ఎవరు? ఇప్పుడే లాబీయింగ్ మొదలైందా? ప్రస్తుత అధికారులు, పదవి విరమణ తర్వాత ఏం చేయబోతున్నారు. ప్రభుత్వం వారి సేవలు వినియోగించుకుంటుందా?

తెలంగాణ ప్రభుత్వంలో అత్యున్నత అధికారి పోస్టులు ప్రధానంగా రెండున్నాయి. ఒకటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ పదవులకు త్వరలో కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎస్‌గా  శాంతి కుమారి ఉన్నారు. ఆమె 2023 జనవరి 11న తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శాంతి కుమారి పదవి కాలం ఈ నెల 30తో ముగియనుంది. శాంతి కుమారి 30న పూర్తిగా ఐఏఎస్ పదవి నుంచి రిటైర్ అవ్వనున్నారు. ఈ క్రమంలో కొత్త వారిని సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఐతే ఇప్పటికే కొన్ని పేర్లను పరిశీలించినట్టు సమాచారం.

ప్రస్తుత సీఎస్ శాంతి కుమారికి కొత్త బాధ్యత అప్పగిస్తారా?

తెలంగాణలో సీఎస్‌గా రిటైర్ అయిన వారి సేవలను ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి. ఈ విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాంతి కుమారి సేవలను కొనసాగించాలని ఆలోచనలో ఉందట. దీంట్లో భాగంగా శాంతి కుమారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఐతే కొన్ని రోజుల కిందే సమాచార, ప్రసార శాఖలో కీలక పదవి ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా...అందుకు శాంతి కుమారి ఆలోచించి నిర్ణయం చెబుతానని చెప్పారట. శాంతి కుమారి తర్వాత ఎవరిని సీఎస్‌గా నియమించాలనే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.

రేసులో కీలక అధికారులు

ప్రస్తుతం రేసులో రామకృష్ణారావు, వికాస్ రాజ్, జయేశ్ రంజన్ వంటి కొంత మంది ఉన్నారు. రామకృష్ణరావు ఆగస్టు నెలాఖరుకు రిటైర్డ్ అవ్వనున్నారు. దీంతో ఆయనను నియమిస్తుందా? లేక వేరే వారి వైపు మొగ్గు చూపుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక జయేశ్ రంజన్, వికాస్ రాజ్ కూడా సీనియర్లుగానే ఉన్నారు. జయేశ్ రంజన్ పదవికాలం 2027లో ముగియనుండగా, వికాస్ రాజ్ 2028లో రిటైర్డ్ అవుతారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయేశ్ రంజన్ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయి.  ఇక బిహార్ కు చెందిన వికాస్ రాజ్ ఎన్నికల సమయంలో సీఈవోగా ఉన్నారు. వీరిద్దరు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారులే. ఇప్పటికే వీరిద్దరూ కీలక పదవుల్లో ఉన్నారు. ఐతే వీరిలో ఎవరినో ఒకరిని నియమిస్తుందా? లేక మరో వ్యక్తికి పదవి ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది.

ఇక డీజీపీగా ఎవరిని నియమిస్తారో..?

తెలంగాణ డీజీపీ పదవి కూడా అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంలో ఈ పోస్టు ప్రధానమైనది. సీఎస్ తర్వాత డీజీపీ పోస్టు కీలకం.  ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా జితేందర్ కొనసాగుతున్నారు. జితేందర్ గత ఏడాది జులై లో బాధ్యతలు స్వీకరించారు.  ఆయన పదవికాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తికానుంది.  దీంతో ఇప్పటి నుంచి కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈ పోస్టు కోసం కొందరు పోటిపడుతున్నారట.

నియమనిబంధనల ప్రకారం సీనియార్టిని బట్టి పోస్టుకు ఎంపిక చేస్తారు. జితేందర్ కంటే ముందు రవిగుప్తా కొంతకాలం డీజీపీగా పని చేశారు. ప్రస్తుతం రవిగుప్తా హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రవి గుప్తా రిటైర్డ్ కాబోతున్నారు. ఇక హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి, సౌమ్యా మిశ్రా, శిఖ గోయల్ పేర్లు కూడా ఈ పోస్టు రేసులో వినిపిస్తున్నాయి. సీవీ ఆనంద్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలోనే డీజీపీగా ఎంపిక చేస్తారని చర్చ జరిగింది. కానీ సీనియార్టీ ప్రకారం జితేందర్‌ను ఎంపిక చేసింది. ఇప్పుడైనా అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. సీవీ ఆనంద్ సీనియర్ ఐపీఎస్ మాత్రమే కాదు...ప్రభుత్వాధినేతకు బంధువు కూడా అని చెప్తున్నారు. ఐతే ఎవరికి అనుకూలంగా పనిచేయకుండా చట్ట పరిధిలో పని చేస్తారని పేరుంది. ఇలా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఈసారి ఆయననే డీజీపీగా నియమిస్తారని చర్చించుకుంటున్నారు.

   
ఐతే ఐదుగురిలో కొంతమంది పోలీస్ అధికారుల పనీతీరుపై ఇప్పటికే సీఎం ఆగ్రహంగా ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు, గొడవలు, ఘర్షణలపై ముందుగానే ప్రభుత్వాన్ని కొందరు హెచ్చరించకపోవడంపై అసహనంగా ఉన్నారట. కానీ పదవి ఎంపికలో నియమనిబంధనలు పాటించాలని...ఈ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు సమాచారం. వీరిలో కేంద్ర హోంశాఖ అనుమతించిన వారిని డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ కీలక అధికారుల ఎంపిక ఆసక్తి రేపుతోంది. సీఎస్, డీజీపీగా ఎవరిని నియమిస్తుందో చూడాలి.

Views: 48

Latest News