బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ

- పెద్దాయన ప్రసంగం ఎలా ఉండబోతోంది?
- కాంగ్రెస్ పాలనపై ఏం మాట్లాడబోతున్నారు?
- సిల్వర్ జూబ్లితో శ్రేణుల్లో కొత్త జోష్ రాబోతుందా?
- రజతోత్సవ సభలో కేసీఆర్ కమ్ బ్యాక్ ఇస్తారా?
సాయి సూర్య తెలంగాణ: సభలు నిర్వహించడంలో ఆ పార్టీకి తిరుగులేదు. ఆయన చేసే ప్రసంగాలకు ఆకర్షితులవ్వని జనం లేరు. ప్లేస్ ఏదైనా...ఒక్క సారి పెద్దాయన స్వరం మొదలైందంటే చాలు...ప్రత్యర్థులకు గుబులే. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి కచ్ వరకు అన్ని విషయాలపై అనర్గలంగా మాట్లాడగలరు. తన మాటతోనే తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన కేసీఆర్... ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది.
దారులన్నీ అటువైపే, నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా ఆ సభ వైపే కదం తొక్కారు. ఎల్కతుర్తి సభకు లక్షలాదిగా తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు సమయం దగ్గరపడుతోంది. పార్టీ ఆవిర్భావమై 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో సిల్వర్ జూబ్లి వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో అధికారం కోల్పోయిన ఏడాదిన్నర తర్వాత నిర్వహిస్తున్న అత్యంత భారీ బహిరంగ సభ. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగంగా చాలా గ్యాప్ తర్వాత ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పెద్దగా బయటికి వచ్చిన సందర్భాలు లేవు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. అప్పుడప్పుడు పార్టీ నేతలకు దిశానిర్దేశంలో మాట్లాడిందే తప్ప...ప్రజల్లోకి వచ్చి ప్రసంగించలేకపోయారు. ప్రజా సమస్యలపై కూడా అడపాదడపా స్పందించారే తప్ప...ప్రభుత్వాన్ని కేసీఆర్ గట్టిగా నిలదీయలేకపోయారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి బీఆర్ఎస్ నేతలే నిత్యం ఏదో అంశంపై కాంగ్రెస్ పాలనపై పోరు సాగిస్తున్నారు. కేసీఆర్ కనీసం పార్టీ నేతలకు కూడా కలవలేకపోతున్నారు. కానీ ఈ రజతోత్సవ సభ వాటన్నిటికి సమాధానం చెప్పనుందని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అంటున్నారు. ఐతే కేసీఆర్ వీటిపై ఏ విధంగా విమర్శనాస్త్రాలు సంధిస్తారోనని ఉత్కంఠగా మారింది.
కేసీఆర్ రాజకీయాల్లో ఏది మాట్లాడినా...పక్కా సమాచారం, వ్యూహంతో మాట్లాడుతారు. గతంలో కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతూ...కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే...సయమనం పాటించామని చెప్పారు. ఐతే ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఓ అంచనాకు వచ్చారు. కేసీఆర్ కూడా ఏడాదిన్నరగా అన్ని గమనిస్తూనే ఉన్నారు. వీటన్నిటిపై రజతోత్సవ సభలో ప్రసంగిస్తారని అంటున్నారు.
తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం రైతుల బాగు గురించే ఆలోచించారు. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతు బంధు ఆ పార్టీని రైతుల మనసుల్లో చిరస్మరణీయం చేసింది. రైతు బీమా, రుణమాఫీ, పెన్షన్లు, ఎరువుల పంపిణీ, సాగు, తాగు నీరు అందజేత, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి బీఆర్ఎస్ పాలనలో ఎప్పటికీ గుర్తిండిపోయేవి. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు రుణమాఫీ వంటివి చేసినప్పటికీ ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చలేకపోతోంది. రైతు బంధును ఇందరమ్మ రైతు భరోసాగా మార్చి ప్రారంభించినప్పటికీ డబ్బులు ఖాతాలో జమ చేయలేకపోయింది. రైతు బీమా ఊసే లేదు. ఆరు గ్యారంటీలో కొన్ని అమలైనప్పటికీ అందరు లబ్దిదారులకు అందడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు, కంచ గచ్చిబౌలి, లగచర్ల భూముల అంశం, ధరణి, నిరుద్యోగ భృతి, పెన్షన్లు వంటివి ప్రభుత్వానికి వ్యతిరేకతను మూటగట్టాయంటున్నారు. దీంతో వీటిపై కేసీఆర్ ఏ విధంగా ప్రసంగిస్తారోనని అందరి మధిలో మెదులుతోంది.
కేసీఆర్ మరోసారి ప్రజల గొంతుకగా మారి ప్రసంగిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్కతుర్తి సభ ద్వారా చెడుగుడు ఆడుకుంటారని అంటున్నారు. కేసీఆర్ ప్రసంగంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్తారని అంటున్నారు.
అంతేకాదు...ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగం తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ మొదలవుతుందని ఆశిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అనేలా పరిస్థితిలో మార్పు ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. మరి కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ఏ విధమైన అస్త్రాలు సంధించనున్నారు.? తెలియాలంటే...ఈనెల 27 వరకు వేచి చూడాల్సిందే.