TGPSC:గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు నిజమేనా?

గ్రూప్ 1పై ఆరోపణలు ఇలా ఉండగా...ఇటు రాజకీయంగా ఈ అంశం అస్త్రంగా మారుతోంది.
సాయిసూర్య, తెలంగాణ బ్యూరో:తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణ అతిపెద్ద ప్రహసనంగా మారింది. ఏ పోటీ పరీక్ష నిర్వహించినా...అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయలేకపోతోంది. తాజాగా గ్రూప్ 1 పరీక్షల అంశం మళ్లీ మొదటికి వచ్చేలా ఉంది. తెలంగాణ ఏర్పాడ్డాక ఎన్నో ఏళ్లుగా అభ్యర్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడగా వచ్చిన నోటీఫీకేషన్ వివాదాలకు కేంద్రంగా మారింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో మరోసారి రద్దు తప్పదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక పరీక్షలు రాసిన అభ్యర్థులు తమకు నష్టం జరుగుతోందని..గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఏ నిరుద్యోగులైతే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి...కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం అయ్యారో..ఇప్పుడు వారే ఆ ప్రభుత్వం చేతిలో మోస పోయాం అంటున్నారు. దీనిపై మరోసారి పోరాటబాట పట్టారు అభ్యర్థులు.
గ్రూప్1 నోటిఫికేషన్ 2022లో విడుదలవగా...బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్ ఆరోపణలతో రెండు సార్లు ప్రిలిమ్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రిలిమ్స్ మరోసారి నిర్వహించి..గ్రూప్ మెయిన్స్ పరీక్షలు చేపట్టింది. ఆ తర్వాత గ్రూప్ 1 జనరల్ ర్యాకింగ్ లిస్ట్ విడుదలైన వెంటనే అనేక అనుమానాలు అభ్యర్థులకు కలిగాయి. అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం, టీజీపీఎస్సీ నిమ్మకు నిరెత్తనట్టు వ్యహరిస్తున్నాయి. ప్రశ్నిస్తే కేసులు పెడుతూ..బెదిరిస్తోందని..కానీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
గ్రూప్ 1 రీఎగ్జామ్ సందర్భంగా అభ్యర్థులు ఆందోళనలు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం తీర్పుతో పరీక్షలు రాయక తప్పలేదు. అంతేకాదు అభ్యర్థులు ప్రభుత్వానికి ఎంత మొర పెట్టుకున్నా...కనీసం పరిగణలోకి తీసుకోలేదు. గ్రూప్1లో మొదట జీవో నెంబర్ 29 తొలగించి జీవో 55 ప్రకారం నోటీఫికేషన్ కొత్తది విడుదల చేశారు. దీనిపైనే అనేక ఆందోళనలు జరిగాయి. అభ్యర్థులను అరెస్టులు, లాఠీఛార్జీలు చేసి బెదరగొట్టారు. అంతటితో ఆగకుండా పోరాటం చేసిన అభ్యర్థులను పర్సనల్ గా టార్గెట్ చేసి...వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆందోళనలు కొనసాగుతుండగానే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థులను కించ పరిచేలా మాట్లాడారు. మొండిగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించేలా చేశారు. దీంతో ఇప్పుడు అభ్యర్థులను నష్టపోయేలా చేయడమే కాదు...ప్రభుత్వానికి మచ్చ తెచ్చుకున్నారు.
గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాక కూడా అనేక అనుమానాలు ఉంటే...టీజీపీఎస్సీ నివృత్తి చేయలేకపోతోంది. హైదరాబాద్ లో 46 సెంటర్లలో మెయిన్స్ పరీక్ష జరగగా...20 సెంటర్ల నుంచి 512 మంది టాప్ ర్యాంకులు సాధించారు. 26 సెంటర్లో 106 మందికి మాత్రమే టాప్ ర్యాంకులో ఉన్నారు. కోటీ ఉమెన్స్ కాలేజీ నుంచి టాపర్స్ ఎక్కువ వచ్చారు. ఇక ఒకే సెంటర్లలో 110 మంది టాపర్స్ గా ఉన్న వారు పక్కపక్క కూర్చున్న వారే అని అంటున్నారు. సీట్ బై, సీట్, పక్కపక్కను కూర్చున్న అభ్యర్థులకు ఎక్కువ మందికి సేమ్ మార్కులు వచ్చాయి. ఇలాంటిదే గత ఏడాది నీట్ పరీక్షలోనూ జరిగింది. దానిపై విచారణలో పేపర్ లీక్, మాల్ ప్రాక్టిసింగ్ జరిగినట్టు తేలింది. బీహార్ కేంద్రంగా జరిగినట్టు బయటపడింది. దాంతో ఎన్టీయే చర్యలు తీసుకుంది. ఐతే గ్రూప్ 1లో మాల్ ప్రాక్టిసింగ్ జరగలేదని...కానీ మూల్యాంకనంలో తేడా జరిగిందని, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు.
ఇక తెలుగులో రాసిన అభ్యర్థుల కంటే...ఇంగ్లీష్ లో రాసిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. పేపర్ ఉర్దూలో రాసిన వారు కూడా ఇందులో కొందరు టాప్ ర్యాంకు సాధించడం కూడా అనుమానాలకు తావు ఇచ్చింది. పేపర్ మూల్యాంకనంలో తప్పులు జరిగాయని చెప్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష తెలంగాణకు చెందినది. తెలంగాణ అంటే తెలుగు భాష. కానీ ఇక్కడ అత్యున్నత పోస్టు గ్రూప్ 1లో పరీక్షల్లో తెలుగు అభ్యర్థుల జాడే లేదు. పక్క రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక సొంత భాషను అభివృద్ధి చేసుకుంటు.. నీట్ వాటి వాటిలో స్థానిక భాష కోసం పోరాడుతున్నాయి...తెలంగాణ మాత్రం తెలుగును మూలన పడేస్తోంది. తెలుగులో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వారికి నష్టం కలిగించింది. మరి సొంత రాష్ట్రంలో తెలుగులో రాస్తే ర్యాంకు రాకపోతే...యూపిఎస్సీ వంటి వాటిలో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వకపోతే నష్టం కలగదా? యూపిఎస్సీ తెలుగును ఎత్తేస్తే...పరిస్థితి ఎంటీ? రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఎత్తేసే ఆలోచనలో ఉందా? ఇవే కాదు అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్నారు.
గ్రూప్ 1పై ఆరోపణలు ఇలా ఉండగా...ఇటు రాజకీయంగా ఈ అంశం అస్త్రంగా మారుతోంది. గత ప్రభుత్వంలో వచ్చిన ఈ నోటిఫికేషన్ పారదర్శకంగా పూర్తయి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదంటున్నారు.. బీఆర్ఎస్ హాయంలోనే పేపర్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. అప్పుడు కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన కొందరు అభ్యర్థుల తరఫున పోరాడారు. ఐతే బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక...సిట్ విచారణలో ఏం తేలింది చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు జరిగితే సిట్ వేసి పరీక్ష వాయిదా వేసి ఊరుకుంది. అప్పుడు మాట్లాడని..కొందరు బీఆర్ఎస్ నేతలు..ఇఫ్పుడు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా అప్పట్లో నిజాయితీగా, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి...ఇప్పుడు మాట తప్పుతోందని అభ్యర్థులు అంటున్నారు. గత ప్రభుత్వం పోరాటాలు చేస్తే...కనీసం స్పందించింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం తమను లెక్కలోకి తీసుకోవడం లేదంటున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లో తిరిగి పెట్టబడులు తీసుకొస్తున్నాం, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతున్నాం అనటంతోనే కాలం వెల్లదీస్తున్నారని పోటీ పరీక్షల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలు జరిగాయా? పోస్టులు అమ్ముకున్నారా? వంటి అనుమాల నివృత్తికి విచారణ జరపాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించాలన్నారు.