Sitarama Kalyanam:శ్రీరామనవమి సర్వ శ్రేయస్కరం
ఉత్సాహం మధ్య కళ్యాణోత్సవాలు

భద్రాచలం: శ్రీరామనవమి పండుగ రోజే సీతారామ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భద్రాచలంలో ప్రత్యేకంగా కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట, రామతీర్థంలో కూడా కళ్యాణాలు జరుగబోతున్నాయి. శ్రీరామనవమి తొమ్మిది రోజుల పండుగగా కొందరు జరుపుకొంటారు. కొంతమంది పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ మరికొంత మంది శ్రీరామనవమి నుంచి వరుసగా తొమ్మిది రోజులు జరపటం కూడా కనిపిస్తుంది. నవమి ఉత్సవాల సందర్భంగా పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రబద్ధంగా జరిపించి ఎంతో వైభవంగా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను పట్టణాలు, నగరాలలో, పల్లెల్లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విధితో నిర్వహించుకోడానికి ముందుగా సీతారామ లక్ష్మణ, భరత, శత్రుఘ్నల విగ్రహాలను కానీ పటాన్ని కానీ పెట్టి పూజ చేయాలి. కొంతమంది హనుమత్ సమేతుడుగా సీతామాతతో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తుంటారు. పూజా ప్రదేశంలో పసుపు రాసిన పీట వేసి దాని విూద ముగ్గుదిద్ది, కుంకుమతో అలంకరించి ఆ పీట మధ్య భాగంలో చందనంతో అష్టదళ పద్మాన్ని వేయాలి. దానివిూద ఒక నూతన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం విూద బియ్యం నలుచదరంగా ఉండేలాగా అంగుళం మందంలో పోయాలి. ఆ బియ్యం మధ్యలో ఒక కలశాన్ని పెట్టి దాని విూద కొబ్బరికాయను, ఆ కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని కిరీటంలో అమర్చాలి. కలశానికి పసుపు, కుంకుమ, చందనంతో చుట్టూ పెట్టి అలంకరించాలి. ఆ కలశంలో మామిడి ఆకులు వేయాలి. కలశానికి గంథంతోనూ, పూలు, అక్షతలతోనూ పూజ చేసి కలశం చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, అధిదేవత, ప్రత్యధి దేవత సహితంగా ఆవాహన చేసి మండపారాధన చేయాలి. ఈ పూజా మండపం అందంగా అలంకారంగా
ఉండేందుకు ఎవరికి వారు తమ శక్తిని అనుసరించి అరటి పిలకలు, మామిడాకులు, లేత చెరకుగడలు అలంకరిస్తుంటారు. పూజా సమయంలో రామ అష్టోత్తర శతనామావళి, సీతా అష్టోత్తర శతనామావళి, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి చదువుతూ తులసీ, మారేడు, తమలపాకులతో పూజ చేయాలి. తులసీతో శ్రీరాముడిని, మారేడుతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుడిని పూజించడం శ్రేయస్కరం. శ్రీసూక్తం, పురుషసూక్తం, విష్ణు సహస్రనామాలు పఠించాలి. నైవేధ్యంగా చక్కెర పొంగలి, పానకం, వడపప్పు, మామిడిపళ్లు పెట్టి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి.