తగ్గేది లేదంటున్న జిన్ పింగ్
.jpg)
ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చర్చంత.. అమెరికా టారిఫ్ అంశంపైనే జరుగుతోంది. ఏ దేశాన్ని అడిగినా.. ఏ దేశాదినేతను కదిపినా.. టారిఫ్ పైనే మాట్లాడుతున్నారు. సుంకాలతో అమెరికాలో ఆయా దేశాల వస్తువులకు గిరాకీ పడిపోతుందని భయం నెలకొంది. కానీ.. ఆ సుంకాలపై మాత్రం అగ్ర రాజ్యాన్ని పల్లెత్తు మాట అనలేకపోతున్నాయి. ఒక్క దేశం మాత్రం అమెరికా టారిఫ్ లకు తగ్గేది లేదు అంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా డజనుకు పైగా దేశాల పై అధిక సుంకాలు విధించారు. భారత్ ఈ అంశం పై ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం సవాల్ విసురుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలను తక్షణమే 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10 నుండి అమెరికా వస్తువులపై సుంకాన్ని 34 శాతం నుండి 84 శాతానికి పెంచిన చైనా ప్రతీకార చర్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ కొత్త టారిఫ్ ప్రకటించారు.
ఈ వార్ కొనసాగుతుండగా... చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మరింత ముందుకెళ్లి "మేము చైనీయులం ఎవరికీ తలొగ్గం" అంటూ పోస్ట్ పెట్టడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఆ పోస్టులో "చైనా రెచ్చగొట్టే చర్యలకు భయపడదు.. అది వెనక్కి తగ్గదు" అని అన్నారు. అంతేకాదు, 1953లో అమెరికాతో యుద్ధంలో ఉన్న చైనా మాజీ నాయకుడు మావో జెడాంగ్ వీడియోను మావో నింగ్ షేర్ చేశారు.
మావో నింగ్ X లో పోస్ట్ చేసిన వీడియోలో, జెడాంగ్ ఇలా అన్నారు, "ఈ యుద్ధం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇది ఒకప్పుడు అధ్యక్షుడు ట్రూమాన్ మీద ఆధారపడి ఉండేది. అదిప్పుడు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ మీద ఆధారపడి ఉంది. తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే అది వారి ఇష్టం. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానితో సంబంధం లేకుండా, మేము ఎప్పటికీ లొంగం. మేము పూర్తిగా విజయం సాధించే వరకు పోరాడుతాము" అని జెడాంగ్ అన్నారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికి ట్రంప్ స్పందించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన దేశం కోసం ఎంత దూరమైన వెళ్తారని మరో కామెంట్ చేశారు. ఇలా ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోంది.
ఐతే ట్రంప్ టారిఫ్ నిర్ణయం అమెరికాకు మేలు చేస్తుందని.. భావించినప్పటికీ.. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మాంద్యం తప్పదని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ట్రంప్ పక్కా వ్యూహంతో గ్రే జోన్ వార్ కు దిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆధునిక కాలం లో యుద్ధాల తీరు మారింది. ఒక దేశాన్ని పడగొట్టాలి అంటే నేరుగా ఆయుధాలు, సైనిక శక్తి వినియోగం అవసరం లేదు. గ్రే జోన్ వార్ తో.. ఆయా దేశాలను తమ గుప్పిట్లోకి తీసుకోవచ్చు. గ్రే జోన్ వార్ లో ఆయా దేశాల పై...టారిఫ్లు విధించడం, ఇతర సహకారం అందకుండా అడ్డుకోవడం, తమ దేశం పై ఆధార పడేలా చేయడం, ఆర్థికంగా నష్టపోయేలా చేయడం, ఆ దేశ ఎన్నికలను ప్రభావితం చేసే చర్యలు, రాజకీయ అంశాల్లో పరోక్షంగా కలిపించుకోవడం ద్వారా ఆ దేశాన్ని నష్టపరిచి..మళ్ళీ ఆడుకొని గుప్పిట్లో పెట్టుకొనే వ్యూహాలను అమలు చేస్తుంది. అమెరికా ఈ తరహా వ్యూహం తో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. మరి ట్రంప్ 4ఏళ్ల పాలన సాగుతుందోనని చర్చ జరుగుతోంది.