Medical shop:ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా మెడికల్‌ షాపులు.

వ్యాపారమే పరమావధిగా అడ్డగోలు పనులు.

On
Medical shop:ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా మెడికల్‌ షాపులు.
డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణ కరువు

  • ఫార్మాసిస్టులు లేకుండానే మందుల విక్రయం
  • గుర్తింపులేని కంపెనీల ట్యాబ్లెట్ల అమ్మకం
  • కల్తీ మందులతో నష్టపోతున్న వినియోగదారులు
  • లాభాలు ఆర్జిస్తున్న మెడికల్‌ షాపు యజమానులు
  • డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణ కరువు
  • గల్లీకొక మెడికల్‌ షాపు తెరుస్తున్న యజమానులు
  • ఎలాంటి అనుభవం లేకుండానే షాపుల నిర్వహణ

ఇబ్రహీంపట్నం, సాయి సూర్య : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్‌లో మెడికల్ స్టోర్లు కిరాణా షాపుల్లా వెలుస్తున్నాయి. గల్లీకి రెండు నుంచి మూడు మెడికల్ దుకాణాలు వెలుస్తున్నాయి. స్టోర్స్‌లో ఫార్మాసిస్ట్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. అంతేకాదు కొత్త కొత్త కంపెనీలు, గుర్తింపు లేని ఫార్మా కంపెనీల పేర్లతో మందులు అమ్మేస్తున్నారు. అధిక ధరలు, గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయి. 

జ్వరం, జలుబు, తలనొప్పి ఇలా ఏదైనా ప్రజలు నేరుగా మెడికల్‌ షాపునకు వెళ్ళి మందులు కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ వద్దకు వెళ్లే టైమ్ లేకనో, డబ్బులకు వెనకాడి వెళ్లలేని వారు మెడికల్ షాపులను సంప్రదిస్తున్నారు. దీంతో డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌, కనీసం ఫార్మాసిస్ట్‌ లేకుండా మెడికల్‌ షాపు యజమానులు మందులు అందజేస్తున్నారు. యాంటిబయోటిక్స్‌తోపాటు రెండు, మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రజల అవసరాలను క్యాష్‌ చేసుకుంటున్నారు. మందులు వాడినా జబ్బు నయం కాకపోతే అప్పుడు వైద్యులను సంప్రదిస్తున్నారు. నష్టపోవడం వినియోగదారుల వంతు అయితే లాభాలు మెడికల్‌ షాపుల యజమానులు అర్జిస్తున్నారు. 

తుర్కయంజాల్‌ మున్సిపల్ లో వందలకొద్దీ మెడికల్‌ షాపులు నడుస్తుండగా, అందులో చాలా వరకు నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్‌ షాపుల్లో ప్రభుత్వ ఆమోదం పొందిన ఫార్మా కంపెనీల మందులనే విక్రయించాలి. కానీ అందుకు విరుద్దంగా ఆయా షాపుల యజమానులు వ్యవహరిస్తున్నారు. గుర్తింపులేని ఫార్మా కంపెనీలనుంచి మెడికల్ షాపుల యజమానులకు కమీషన్ ఆశ చూపడంతో వారు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. చిన్న పిల్లల మెడిసిన్స్ కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారు. వీటి వల్ల రోగం నయం కాకపోవడమే కాదు... దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ధరల విషయానికి వస్తే నిర్దేశించిన వాటికంటే ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

వినియోగదారుడికి అమ్మే మెడిసిన్ లో దుకాణాదారుడికి కొంత మేర కమీషన్ ఉంటుంది. ఆ కమీషన్ తీసుకుంటూనే కస్టమర్ల నుంచి అధికంగా వసూలు చేసి మరింత ఎక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. దీంతో రెండు విధాలుగా ధనార్జన సాగుతోంది. ఇక డాక్టర్ ప్రిస్ప్రిప్షన్ లేనిదే కొన్ని మందులు విక్రయించకూడదు. కానీ వాటిని కూడా మెడికల్ షాపుల్లో పని చేసే వారు, వాటి యజమానులు తామే డాక్టర్లుగా రోగానికి మందులు ఇస్తున్నారు. వీటిపై అవగహన ఉన్న వారు మెడికల్ షాపుల యజమానులను ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఏం చేసుకుంటారో, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని తెగేసి చెప్తున్నారు.

medical-shop

మెడికల్ షాపులు నిర్వహించాలంటే కొన్ని నిబంధనలు  పాటించాలి. డ్రగ్‌ అండ్‌ కాస్మోటిక్‌ యాక్టు-1940, ఫార్మసీ యాక్టు-1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎమ్ ఫార్మసీ పూర్తి చేసిన వారు మాత్రమే మెడికల్‌ షాపులను నిర్వహించాల్సి ఉంటుంది. షాపు పర్మిషన్‌ తీసుకునే సందర్భంలో సంబంధిత పార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో అనుసంధానం చేసి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించాలి . తర్వాత సంబంధిత అధికారుల నుంచి అనుమతులు మంజూరైతే...షాపులను నిర్వాహించాలి.

అంతేకాదు మందులు విక్రయించడానికి ఫార్మసిస్టులు మెడికల్ షాపుల్లో ఉండాలనే నిబంధన ఉండగా దాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. మెడికల్‌ షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండానే విక్రయాలు చేపడుతున్నారు. కనీసం ఫార్మసిస్టు పర్యవేక్షణలోనైనా మందులను ఇవ్వాల్సివుండగా 10వ తరగతి, ఇంటర్‌ అర్హత కల్గిన వారితో మందుల విక్రయాలు చేపడుతున్నారు. ఫార్మసీ పూర్తిచేసిన వారి సర్టిఫికెట్లతో షాపుల నిర్వాహకులు తమ దందాను సాగిస్తున్నారు. ఇందుకు సంబంధిత ఫార్మసిస్టులకు ఏడాదికి లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.  

షాపుల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేకుండానే అడ్డదారిన పర్మీషన్లు పొందుతూ తమ దందాను సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ ప్రాథమిక చికిత్స కేంద్రానికి పక్కన వేరే వారి పేరిట మెడికల్‌ షాపును నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుతున్నా సంబంధిత ఔషద నియంత్రణ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, సంబంధిత షాపుల నిర్వాహకుల నుంచి మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Views: 309

Latest News